అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. లక్ష కోట్ల రూపాయల భారీ వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (పండ్ల తోటల సాగు, పరిశోధనా కేంద్రం), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

రాయలసీమను దేశంలోనే అగ్రగామి ఫ్రూట్ బౌల్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 10 జిల్లాల పరిధిలోని 201 క్లస్టర్లలో (ప్రాంతీయ సమూహాలు) సమగ్ర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. విత్తనం నాటే స్థాయి నుంచి విదేశాలకు పంట ఉత్పత్తులను ఎగుమతి చేసే వరకు రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా నిలవనుంది.

ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. ఇందులో 40 వేల 352 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, ప్రైవేట్ రంగం నుంచి మరో 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను కూడా ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాయలసీమ రైజింగ్ పేరిట ఈ బృహత్ ప్రణాళికను రూపొందించారు.

పంటల ఉత్పత్తి నుంచి కోత, గ్రేడింగ్ (నాణ్యతను బట్టి వర్గీకరించడం), ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్ (పంటలు పాడవకుండా నిల్వ చేసే శీతలీకరణ గిడ్డంగులు), ప్రాసెసింగ్, బ్రాండింగ్, రవాణా వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెటింగ్ వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఈ హబ్ కల్పించనుంది.

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే, వ్యవసాయ రంగంలో మార్పుల కోసం రిలయన్స్ సంస్థతో కలిసి ఈ విద్యా, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.