కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మేయర్ అభ్యర్థిగా జనసేన తరపున ఆకుల భవాని, వైసీపీ తరపున సత్యశ్రీ పోటీలో ఉన్నారు. మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో, వైసీపీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి, కూటమి జనసేన మత్స్యకార మహిళకు అవకాశం కల్పించాయి.

ఈ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేయర్ సీటు జనసేన కోటాలో ఉన్నప్పటికీ, టీడీపీ కూడా అంతే సీరియస్‌గా పనిచేస్తోంది. ఇందుకోసం మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన 10 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

కార్పొరేషన్‌లో 2 లక్షల 85 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపులు 67 వేలు, అగ్నికుల క్షత్రియులు 51 వేలు, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు 31 వేల మంది ఉన్నారు. కుల సమీకరణాలు కీలకం కావడంతో, ఆయా వర్గాలకు చెందిన మంత్రులతో ప్రచారం చేయించాలని కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నారు.

వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఈసారి మెరుగైన ఫలితాల కోసం ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. గతంలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన లెక్కలను సరిచేయాలని కూటమి భావిస్తోంది.

ఎమ్మెల్సీ నాగబాబు ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో కాకినాడలో రాజకీయ వేడి పెరుగుతోంది. మంత్రుల ప్రచారంతో అన్ని రకాల ఈక్వేషన్లను సెట్ చేయాలని కూటమి భావిస్తుండగా, వైసీపీ కూడా కొత్త అభ్యర్థులతో పోటీకి సిద్ధమైంది.