బోధన్‌లో జరిగిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. వయసు రీత్యా తాను ఇక పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా బోధన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన, తన వయసును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక రాజకీయ అసంతృప్తి కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సుదర్శన్ రెడ్డి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బోధన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పట్లో మంత్రి పదవి ఆశించినప్పటికీ, అది దక్కలేదు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా క్యాబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. అయితే, ఈ పదవి విషయంలో ఆయన పూర్తి సంతృప్తిగా లేరని, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్నారని సన్నిహితుల వద్ద గతంలో ప్రస్తావించినట్లు సమాచారం.

ఈ సీనియర్ నేత వ్యాఖ్యలతో బోధన్ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే కాంప్రమైజ్ అయ్యానని, ఇకపై రాజీపడటం కష్టమని ఆయన భావించారా అన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. మంత్రి పదవి కోసం చివరి వరకు ప్రయత్నించినా, వయసు కారణంగా ఆ అవకాశం దక్కలేదన్న ప్రచారం కూడా జిల్లా రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది.

సుదర్శన్ రెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటే, ఆయన వారసత్వం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు బోధన్‌లో ప్రధాన చర్చగా మారింది. ఆయన కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా లేదా పార్టీకి విధేయులైన ఇతర నేతలకు అవకాశం దక్కుతుందా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. అయితే, ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ప్రస్తుత అంచనాలు చెబుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటిస్తుండటం గమనార్హం. దక్షిణ తెలంగాణకు చెందిన ఒక మంత్రి కూడా గతంలో ఇలాంటి ప్రకటన చేసి రాజకీయ చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో, సుదర్శన్ రెడ్డి ప్రకటన కేవలం వయసు కారణమా లేక రాజకీయ వైరాగ్యమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.