శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీలో 2005 తర్వాత ఇప్పుడు రెండో విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్యలత పోటీలో ఉన్నారు.
అయితే, పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి కాకుండా, కొత్తగా చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాం ఏఎంసీ ఛైర్మన్ పదవి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ, జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు మున్సిపల్ ఛైర్మన్ సీటు విషయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.
రాజాం మున్సిపాలిటీలో 40 శాతానికి పైగా కాపు సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి. ఈ వర్గం జనసేనకు వెన్నుదన్నుగా ఉన్నప్పటికీ, దేవాంగుల సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయించడంపై ఇతర వర్గాల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పార్టీ పెద్దలు ఈ అంతర్గత సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
మరోవైపు, ఈ సీటు తమకు దక్కుతుందని ఆశించిన టీడీపీ నాయకులు కూడా జనసేన అభ్యర్థిత్వంపై అసహనంతో ఉన్నారు. కూటమిలోని రెండు పార్టీల నేతలు ఎవరికి వారు దూరంగా ఉండటంతో, రాజాంలో కూటమి గెలుపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలకు కొత్త అయిన బనిశెట్టి సౌజన్యలత కేవలం కూటమి ప్రభావాన్ని మాత్రమే నమ్ముకుని ప్రచారం చేస్తున్నారు.
విపక్షమైన వైసీపీ పరిస్థితి కూడా అంత సవ్యంగా లేదు. సారధి, కొత్తవలస, కొండవలస, పోనిగిటి వలస గ్రామాల్లో వైసీపీకి పట్టు ఉన్నప్పటికీ, పార్టీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాలను అధిగమిస్తే వైసీపీకి అవకాశాలు ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి అభ్యర్థికి ప్రచారం కంటే మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లడమే పెద్ద సవాలుగా మారింది. సొంత పార్టీ నేతల అలక, టీడీపీ నేతల అసంతృప్తి మధ్య అభ్యర్థి అడకత్తెరలో చిక్కుకున్నట్లు ఫీలవుతున్నారు. కూటమి పెద్దలు ఈ అసంతృప్తిని ఎలా సెట్ చేస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.



