గతంలో తనపై వ్యక్తిగత దాడి జరిగిందని, దీని వెనుక తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఉందని షర్మిల స్వయంగా ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఎన్బీకే (నందమూరి బాలకృష్ణ) బిల్డింగ్ నుంచే తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు గుర్తించారని ఆమె అప్పట్లో పేర్కొన్నారు. ఈ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు టీడీపీకి అనుకూలమైనవని, బాలకృష్ణకు దీనితో సంబంధం లేదని ఎలా అనుకోగలనని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో తనపై దుష్ప్రచారం మరింత పెరుగుతుందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని షర్మిల గతంలో చెప్పారు. చంద్రబాబు ఆటలో తాను పావుగా మారాన్నని భావిస్తున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. అయితే, అప్పట్లో చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన షర్మిల, ఇప్పుడు ఆయనకు మద్దతుగా వ్యవహరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలపై రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త, రాజకీయ విశ్లేషకులు మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి స్పందించారు. చంద్రబాబుతో రాజకీయాలు చేస్తూ వైఎస్ జగన్పై కుట్రలు చేస్తున్న షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వానికి దూరమైనట్లేనని ఆయన విశ్లేషించారు. తండ్రి ఆశయాల కోసం కష్టపడుతున్న అన్నకు మద్దతుగా ఉండకుండా, ఇలా చంద్రబాబుతో చేతులు కలపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్తి వివాదంపై కూడా పురుషోత్తమ రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆస్తి తనదే అయితే బెంగళూరులో ధర్నా చేయడం ఎందుకని, కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది కదా అని ఆయన నిలదీశారు. కోర్టుకు వెళ్లకుండా ధర్నాలు చేయడం అంటే ఆ ఆస్తి తనది కాదనే విషయం అర్థమవుతోందని, దీన్ని ఆసరాగా చేసుకుని అన్నా-చెల్లెళ్ల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.




