బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. నవంబర్ 20న ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తాంధ్ర జిల్లాల్లో నవంబర్ 19, 20 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ తుఫాను ప్రభావం కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాలపై ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలను ముందస్తుగా మోహరించాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సేవలకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు.
భారీ వర్షాల వల్ల వచ్చే వరద నీటిని రిజర్వాయర్లకు మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర అంచనా బృందం చేసిన సిఫార్సులను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సీఎం హెచ్చరించారు. తుఫాను తీరం దాటే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.







