బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. సెప్టెంబర్ 22 ఉదయానికి ఇది గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 200 కి.మీ, విశాఖపట్నానికి తూర్పున 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

ఈ అల్పపీడనం గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో ఇది 'అర్నాబ్' తుఫానుగా మారనుంది.

ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, పిల్లలు మరియు పెద్దలు అనవసరంగా బయటకు రావద్దని సూచిస్తున్నారు.

వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మొబైల్ యాప్స్ ఉపయోగపడతాయి. భారత వాతావరణ శాఖ రూపొందించిన 'Mausam' యాప్ ద్వారా ప్రస్తుత వాతావరణం, రియల్ టైమ్ అప్‌డేట్స్, తీవ్రమైన హెచ్చరికలు, గంటవారీ సూచనలు పొందవచ్చు.

ఇతర యాప్స్‌లో 'The Weather Channel' ఒకటి. ఇందులో రాబోయే 2 గంటల వర్ష సూచనలను నిమిషానికి నిమిషం తెలిపే 'మినిట్‌క్యాస్ట్' ఫీచర్ ఉంది. దీనితో పాటు 'WeatherBug', 'Weather Underground' యాప్స్ కూడా ప్రాంతీయ వర్ష సూచనలు, రాడార్ ఫొటోలు, తుఫాను ముప్పు మ్యాప్‌లను అందిస్తాయి.

ఈ యాప్స్‌లో కొన్ని ఫీచర్లు ఉచితంగా లభిస్తాయి. అయితే, ప్రకటనలు లేని అనుభవం లేదా అడ్వాన్స్ ఫీచర్ల కోసం వినియోగదారులు నెలవారీ లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.