తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క వెంకటాపూర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 54 లక్షల వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్లు, రూ. 45 లక్షలతో డ్రైనేజీ పనులను ఆమె ప్రారంభించారు.
ఈ పనుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన CRR (గ్రామీణ రోడ్ల అభివృద్ధి) ప్లెయిన్ నిధుల నుంచి రోడ్ల నిర్మాణానికి, 2024-25 సంవత్సరానికి చెందిన CRR SC సబ్ ప్లాన్ నిధుల నుంచి డ్రైనేజీ సౌకర్యాల కల్పనకు నిధులు సమకూర్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె వివరించారు.
వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమానికి ముందు వెంకటాపూర్ పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పీఏసీఎస్ ఛైర్మన్ శ్రీనివాస్, ఇతర సభ్యులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఆర్గనైజేషన్ చైర్మన్ బనోటు రవిచందర్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








