అన్నమయ్య జిల్లా రామాపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయచోటి మున్సిపాలిటీలో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించే ధైర్యం మంత్రి రాంప్రసాద్‌కు లేదని ఆయన విమర్శించారు. ఒక మంత్రి హోదాలో ఉండి నామినేషన్ కేంద్రాల్లోకి చొరబడటం, మహిళలను దుర్భాషలాడుతూ పత్రాలు చించడం దారుణమని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తే, తన అభ్యర్థికి 20 వేల మెజారిటీ తగ్గితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని శ్రీకాంత్ రెడ్డి సవాలు విసిరారు. మంత్రికి నిజంగా ప్రజాదరణ ఉంటే, స్వేచ్ఛగా ఎన్నికలు జరిపి తన సత్తా నిరూపించుకోవాలని ఆయన కోరారు. కేవలం పోస్టల్ బ్యాలెట్ ద్వారా గెలిచిన వ్యక్తి మంత్రి అని ఆయన ఎద్దేవా చేశారు.
రాజకీయ పార్టీలు, మేధావులు, ఎన్నికల సంఘం స్పందించకపోతే భవిష్యత్తులో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లే పరిస్థితి ఉండదని శ్రీకాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, పోలీసులతో బెదిరించడం, ఫోన్లు లాక్కోవడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో భయం నింపి, వారి ధైర్యాన్ని మంత్రి దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేవలం లూటీ చేయడం కోసం డ్యూటీ తీసుకున్నారని, తాను మాత్రం అభివృద్ధి కోసం పని చేస్తున్నానని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. గతంలో తన చేతిలో రెండుసార్లు డిపాజిట్ కోల్పోయిన మంత్రి, తనతో పోల్చుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఈ పరిణామాలపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.







