తెలంగాణ రాజకీయాల్లో మరింత కీలకం కావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంపై దృష్టి పెట్టిన క్రమంలో, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన తన వంతు పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా ఇస్తే అది పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఆయన ముందుగానే అప్రమత్తమవుతున్నారు.
తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన రెండు రోజుల యాత్ర చేశారు. ఇప్పుడు తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నషా ముక్త భారత్ యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. యువతలో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమమని, ఇది రాజకీయాలకు అతీతమని ఆయన ప్రకటించారు.
రాజకీయాలకు అతీతం అని చెప్పడం ద్వారా అన్ని వర్గాల మద్దతు కోరుతూనే, మరోవైపు ఈ యాత్రకు బీజేపీ మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ యాత్ర జరిగే మార్గంలో ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులతో పాటు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, విద్యావేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
రాజ్యాణేతర వర్గాలను కలుపుకుంటూ అన్ని సెక్షన్లలో తనకు సానుకూలతను పెంచుకునేందుకు ఈ యాత్రను ఆయన ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇది సామాజిక కార్యక్రమంలా కనిపిస్తున్నప్పటికీ దీనివెనుక రాజకీయ ప్రయోజనం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలని ఆయన భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టిని దృష్టిలో ఉంచుకుని ఆయన వీలైనంత ఎక్కువగా ప్రజల మధ్య ఉంటున్నారు. ఈ యాత్ర వల్ల వ్యక్తిగతంగా కిషన్ రెడ్డికి, పార్టీగా బీజేపీకి లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రక్రియలో ఇది కూడా భాగమని పరిశీలకులు భావిస్తున్నారు.







