నవంబర్ 24న ముగిసిన పుష్కర్ పశువుల మేళాలో భారీకాయం కలిగిన పశువుల మధ్య, పింకీ అనే చిన్న గేదె ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాధారణ గేదెలతో పోలిస్తే చాలా తక్కువ ఎత్తు ఉండటంతో, దీనిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదెగా పిలుస్తున్నారు.
ఈ గేదెను చూసేందుకు చిన్నారుల నుంచి విదేశీ పర్యాటకుల వరకు అందరూ ఆసక్తి చూపారు. సందర్శకులు పింకీతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ గేదెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.
పింకీ యజమాని సోహిల్ థానేలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. పింకీకి ఐదేళ్ల వయసు ఉన్నప్పటికీ, సాధారణ గేదెల మాదిరిగా శారీరక ఎదుగుదల లేదని ఆయన తెలిపారు. ఇది ఏ ప్రత్యేక జాతి వల్ల కాదని, సహజంగానే ఇలా పెరిగిందని సోహిల్ వివరించారు.
పింకీ తల్లి సుమారు మూడు అడుగుల ఎత్తు ఉండి, రోజుకు రెండు లీటర్ల పాలు ఇచ్చేదని యజమాని చెప్పారు. అయితే, పింకీ ఇప్పటివరకు ఏ దూడకూ జన్మనివ్వలేదని ఆయన పేర్కొన్నారు. తన వద్ద ఉన్న మరికొన్ని విభిన్న జంతువులను వచ్చే ఏడాది మేళాకు తీసుకువచ్చేందుకు సోహిల్ సన్నాహాలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పింకీ విలువ రూ.20 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉండవచ్చని చర్చ జరుగుతోంది. అయితే, దీని ధరపై యజమాని సోహిల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తన విభిన్న రూపంతో పింకీ ప్రస్తుతం ఆన్లైన్లో ట్రెండింగ్లో నిలిచింది.






