హైదరాబాద్‌లోని నార్సింగికి చెందిన హ్యాపీ స్కాలర్స్ స్కూల్ విద్యార్థులు మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్కుకు పిక్నిక్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న భారీ ఇనుప ఊయలపై సుమారు 10 మంది పిల్లలు కూర్చుని ఉండగా, మరో నలుగురు విద్యార్థులు వెనుక నుంచి వేగంగా ఊపడంతో ప్రమాదం జరిగింది.

అదుపుతప్పిన ఊయల ముందుకు వెళ్లి, తిరిగి వెనక్కి వచ్చి బలంగా ఢీకొట్టడంతో పదేళ్ల అభిరామ్ నుదురు, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రమాదంలో యశ్వంత్ అనే మరో విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలు ఊయల వేగాన్ని అంచనా వేయలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ కనీసం ఒక్క టీచర్ గానీ, స్కూల్ సిబ్బంది గానీ లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రత విషయంలో స్కూల్ యాజమాన్యం, పార్కు నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు.

పిల్లలను నమ్మి పంపిస్తే ఇంతటి నిర్లక్ష్యం చూపిస్తారా అని మృతుడు అభిరామ్ తండ్రి ప్రశ్నించారు. సరైన పర్యవేక్షణ, భద్రతా చర్యలు లేకపోవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి మృతికి కారణమైనట్లు, ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఈ విషయం బయటకు రాకుండా కొందరు వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.