బుధవారం ఉదయం తండ్రి పాఠశాల వద్ద దింపిన సమయంలో బాలుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే, తన వీపుపై స్కూల్ బ్యాగ్ వేసుకుని తరగతి గదిలోకి అడుగుపెడుతుండగా, బాలుడు ఒక్కసారిగా వెనక్కి వెల్లకిలా పడిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
బాలుడు స్పృహ కోల్పోవడంతో సిబ్బంది అతడిని వెంటనే స్టాఫ్ రూమ్‌కు తరలించారు. పాఠశాల యాజమాన్యం సమాచారం అందించడంతో తండ్రి అక్కడికి చేరుకుని, ఉపాధ్యాయుడితో కలిసి బాలుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
ఘటనపై పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలుడి మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు చెప్పడంతో, కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తును ముగించారు.
ఇటీవలి కాలంలో పాఠశాల విద్యార్థులు ఇలా హఠాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 31న ముజఫ్ఫర్‌నగర్‌లో రన్నింగ్ రేస్ మధ్యలో 10 ఏళ్ల బాలుడు కుప్పకూలి మరణించగా, ఢిల్లీలో తొమ్మిదేళ్ల చిన్నారి తరగతి గదిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీ ఘటనలో పాఠశాలలో అత్యవసర వైద్య సదుపాయాలు లేవని, గుండెకు చేసే కృత్రిమ శ్వాస ప్రక్రియ (CPR) అందించలేదని ఆ చిన్నారి కుటుంబం ఆరోపించింది.








