అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే బ్యాటర్లు రాణిస్తున్నారు. ఇప్పటికే బ్రెండన్ టేలర్ 168 బంతుల్లో 131 పరుగులు చేసి సెంచరీ సాధించగా, తాజాగా కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ కూడా అజేయ శతకంతో క్రీజులో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో 105 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రియాన్ బెన్నెట్ 115 పరుగులతో, తఫాద్జ్వా త్సిగా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు వెస్లే మదెవెరె 54 పరుగులు చేసి అర్థశతకం సాధించాడు.

జింబాబ్వే స్కోరు పెరగడంలో బ్రియాన్ బెన్నెట్, మదెవెరె కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. కెప్టెన్‌గా టెస్టుల్లో బెన్నెట్‌కు ఇది తొలి సెంచరీ కాగా, ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది అతడికి మూడో శతకం. ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లలో కూడా బెన్నెట్ ఒక్కో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి టెస్టులోనే సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో బెన్నెట్ చేరాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 35 మంది ఆటగాళ్లు ఈ ఘనత సాధించగా, తాజాగా వారి సరసన సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలతో పాటు బెన్నెట్ నిలిచాడు. జింబాబ్వే తరఫున కెప్టెన్‌గా డెబ్యూ (తొలి) సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడు ఇతడే.

గతంలో జింబాబ్వే తరఫున డీఎల్ హూగ్‌టన్, బ్రెండన్ టేలర్, క్రెయిగ్ ఎర్విన్ మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో జియా ఉర్ అక్బర్ రెండు వికెట్లు తీయగా, మొహమ్మద్ సలీమ్, జియావుర్ రెహ్మాన్, ఖయాస్ అహ్మద్, హష్మతుల్లా తలా ఒక వికెట్ పడగొట్టారు. భారీ స్కోరు దిశగా సాగుతున్న జింబాబ్వే, ఈ మ్యాచ్‌లో తన పట్టును మరింత బిగిస్తోంది.