వైఎస్ఆర్ కడప డివిజన్ పరిధిలో అటవీశాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఆంబులెన్స్‌లు, కార్లను ఉపయోగించి అక్రమంగా తరలిస్తున్న సుమారు 114 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రవాణా కోసం ఉపయోగించిన ఏడు వాహనాలను కూడా సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న కడప జిల్లా అటవీశాఖ అధికారిని, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. ఎర్రచందనం వైపు చూడాలంటేనే స్మగ్లర్ల వెన్నులో వణుకు పుట్టాలని ఆయన హెచ్చరించారు.
అక్రమ రవాణా పూర్తిగా నిలిచిపోయేలా అన్ని దారులను మూసేయాలని యాంటి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులకు ఆయన సూచించారు. ఈ అక్రమ రవాణాలో పరారీలో ఉన్న మిగతా నిందితులను కూడా వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
స్మగ్లింగ్ మూలాలు పూర్తిగా బయటపడేలా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ కోరారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తేల్చి చెప్పారు.







