సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారంలో రాగుల దుర్గయ్య (75) అనే వృద్ధుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో మైక్ ఉపయోగిస్తూ పాటలు పాడుతుండగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.

అదే జిల్లాలోని దుద్దేడ గ్రామంలో చెరుకు నాగరాజు (25) అనే యువకుడు మృతి చెందాడు. అయ్యప్ప మాల ధరించిన నాగరాజు, ఓ ఇంటి వద్ద టెంటు వేస్తుండగా ఇనుప పైపులు విద్యుత్ తీగలకు తగిలాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో రేపాక రమేశ్ (28) అనే వ్యక్తి పొలం వద్ద విద్యుత్ తీగ తగిలి మరణించాడు. రైతు వెంట్రామిరెడ్డి తన పొలంలోకి పందులు రాకుండా విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు, అయితే ఈ విషయం రమేశ్‌కు తెలియదు. నారు మడి గలమ తీయడానికి వెళ్లిన రమేశ్, పొరపాటున ఆ తీగను తాకడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో షేక్ బషీర్ (40) అనే యువరైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. తన పొలంలో బోరు మోటార్‌కు సంబంధించిన పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ నాలుగు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.