డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవం, డిసెంబర్ 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన ఈ సమావేశంలో అధికారికంగా విడుదల చేశారు.
నగరంలో క్రీడా వాతావరణం కనిపించేలా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. పనుల పర్యవేక్షణ కోసం ప్రతి విభాగానికి ఒక ఇంచార్జ్‌ను నియమించి, వారిని జవాబుదారీగా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పర్యవేక్షణను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో కలిసి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చూసుకోవాలని సీఎం సూచించారు. మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు, వరంగల్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్లో అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్‌లో సుదర్శన్ రెడ్డిలకు పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు.
క్రీడాకారులు, ఆహ్వానితుల వసతి, భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సీఎం హెచ్చరించారు. స్టేడియంల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడితే సహించేది లేదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు మట్టిలో మాణిక్యాలను గుర్తించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు దేశంలోని అత్యుత్తమ కోచ్‌లను నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు.








