తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ కొత్త విధానం ప్రకారం నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా, 5 నుంచి 8 తరగతులను మాధ్యమిక విద్యగా, 9 నుంచి 12 తరగతులను సీనియర్ సెకండరీ విద్యగా వర్గీకరిస్తారు. 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యను ఉన్నత విద్యగా పరిగణించి, విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ (Specialised Education) అందించాలని సీఎం స్పష్టం చేశారు. 12వ తరగతి తర్వాత విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునేలా భాషా, సమాచార నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం.

ప్రస్తుతం 10వ తరగతి తర్వాత సుమారు 40 శాతం మంది విద్యార్థులు చదువును నిలిపివేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలు, బాలికలు ఎక్కువగా డ్రాపౌట్ అవుతున్నారని అధికారులు వివరించారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల తరహాలో తక్కువ డ్రాపౌట్ రేట్లు నమోదయ్యేలా ఈ మార్పులు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం అవసరమైన మౌలిక వసతులను వెంటనే కల్పించాలని అధికారులకు సూచించారు. అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్సీ పాఠశాలల కోసం శాశ్వత భవనాలను నిర్మించాలని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మార్పుల వల్ల జూనియర్ కళాశాల లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఎటువంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేదా సేవా ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలీటెక్నిక్ కళాశాలల ఆధునీకరణ, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా సీఎం ఆదేశించారు.