శ్రీదేవి అనే యువతి, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. మూడేళ్ల క్రితం దసరా వేడుకల సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్ నమ్మించాడని, వేములవాడ ఆలయానికి తీసుకెళ్లి మాట ఇచ్చాడని శ్రీదేవి పేర్కొంది.
ఈ క్రమంలో శ్రీకాంత్ తనను మూడుసార్లు గర్భవతిని చేశాడని, అతడి సూచనల మేరకు అబార్షన్లు (గర్భస్రావం) చేయించుకున్నానని శ్రీదేవి ఆరోపించింది. ఆ తర్వాత శ్రీకాంత్ తనను దూరం పెట్టడంతో, అతడి తండ్రి సారంగపాణికి ఆధారాలు చూపించినా ఫలితం లేకపోయిందని ఆమె తెలిపింది. స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో శ్రీదేవి సోమవారం నుంచి వర్ధన్నపేటలోని చైర్మన్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. ఆమెకు మద్దతుగా దళిత సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు నిరసనలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఇరు కుటుంబాల పెద్దలతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే చొరవతో శ్రీకాంత్ పెళ్లికి అంగీకరించడంతో, గురువారం సాయంత్రం ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ సారంగపాణి, ఆయన భార్య సుజాత పాల్గొన్నారు.
వివాహం అనంతరం ఇరు కుటుంబాల మధ్య ఒప్పంద పత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ పెళ్లితో నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిరసన ముగిసింది. తనకు అండగా నిలిచిన ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులకు శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపింది.








