నెల్లూరు జిల్లాలో మొత్తం 35 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ZPTC) గాను, టీడీపీ ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 30 స్థానాల్లో విజయం కోసం పార్టీ వ్యూహాలు రచిస్తుండగా, జడ్పీ చైర్మన్ పదవి ఎంపిక వ్యవహారం ఇప్పుడు పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసింది.
ఈ పదవి కోసం కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి నామినేషన్లు వేశారు. అయితే, తనకు అవకాశం రాదని భావించిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం పోలంరెడ్డి, కంభం విజయరామిరెడ్డి రేసులో మిగిలారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇద్దరూ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. దీనిపై పాత తరం ఎమ్మెల్యేలు, ఎక్కువ ZPTC స్థానాలు గెలిచిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. మేయర్ పదవిని ఇప్పటికే ఎంపీ అనుచరుడైన రూప్ కుమార్ యాదవ్కు కేటాయించారని, ఇప్పుడు జడ్పీ చైర్మన్ పదవి కూడా వారికే ఇస్తే తమ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేలతో చర్చించాకే జడ్పీ చైర్మన్ పేరును అధిష్టానానికి పంపాలని సీఎం చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్లో ఆదేశించారు. అయితే, తమను సంప్రదించకుండానే ఎన్నికల పరిశీలకులు పోలంరెడ్డి పేరును అధిష్టానానికి పంపారని నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి మాటలకే పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లా అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.
పోలంరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డికి ఇప్పటికే నామినేటెడ్ పదవి ఇచ్చారని, ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎలా ఇస్తారని ఇతర ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. అభివృద్ధిలో వెనుకబడిన ఉదయగిరి ప్రాంతానికి చెందిన వారికే ఈ పదవి ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఒంటెత్తు పోకడలు కొనసాగిస్తే భవిష్యత్తులో జిల్లా పార్టీలో అంతర్యుద్ధం తప్పదని నేతలు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం నెల్లూరు టీడీపీలో నివురుగప్పిన నిప్పులా మారింది. ఎంపీ దంపతులు సూచించిన వారికే పదవి దక్కుతుందా లేక సీనియర్ ఎమ్మెల్యేల డిమాండ్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








