హైదరాబాద్ అపార్ట్‌మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక భవన నిర్మాణ ఉప నిబంధనలను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఎన్‌ఆర్‌డీసీ ఇండియాతో కలిసి ‘పవరింగ్ విజన్ 2047: ఈవీ అడాప్షన్ అండ్ గ్రిడ్ రెడీనెస్ ఇన్ హైదరాబాద్’ పేరుతో రూపొందించిన నివేదికలో పొందుపరిచారు. ఈ సంయుక్త నివేదికను గురువారం హైదరాబాద్‌లోని బేలా విస్టాలో ఆవిష్కరించారు. ఏఎస్‌సీఐలోని సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సంస్థలు కలిసి 2034-35 ఆర్థిక సంవత్సరం వరకు నగర విద్యుత్ వ్యవస్థ, ఈవీ ఛార్జింగ్ అవసరాలపై ఈ అధ్యయనం చేపట్టాయి.

తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ దాదాపు 70 శాతం వాటా కలిగి ఉందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీ బి.టి. శ్రీనివాసన్ తెలిపారు. భవిష్యత్తులో రాబోయే ఛార్జింగ్ డిమాండ్‌లో 58 శాతం ఇళ్ల నుంచే ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఛార్జర్ల ఏర్పాటుకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, యజమానులు ఐదు రోజుల్లోగా నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చేలా భవన నిబంధనలను సవరించాలని నివేదిక కోరింది.

అలాగే కామన్ ఏరియాల్లో ఛార్జింగ్ సౌకర్యాలు, వ్యక్తిగత సబ్-మీటరింగ్ ఏర్పాటు చేయాలని నివేదిక పేర్కొంది. దీనివల్ల ఛార్జింగ్ ఖర్చులు కామన్ మెయింటెనెన్స్ బిల్లులలో కలవకుండా ఉంటాయని తెలిపింది. గ్రౌండ్ ఫ్లోర్లలో, మొదటి బేస్‌మెంట్‌లలో తగిన ఎన్‌క్లోజర్‌లు, సర్టిఫైడ్ కేబుల్స్‌తో అగ్నిప్రమాద రక్షణ ఏర్పాట్లు చేయాలని శ్రీనివాసన్ వెల్లడించారు. అయితే ఆటోమేటెడ్ లేదా స్టాక్డ్ పార్కింగ్ ప్రాంతాలలో ఛార్జింగ్‌ను నిరోధించాలని సూచించారు.

సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి టైమ్-ఆఫ్-డే టారిఫ్‌లు, బల్క్ ప్రొక్యూర్మెంట్ పద్ధతులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్ ఛార్జింగ్ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్‌లోని 15 నుంచి 20 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదించినట్లు ఒక సభ్యుడు వెల్లడించారు.