భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న తొలి BIMSTEC U23 అథ్లెటిక్స్ మీట్ రెండవ రోజు భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో షేక్ రోషన్ 14.15 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం గెలుచుకున్నారు. ఇదే విభాగంలో శ్రీలంకకు చెందిన సందున్ కోషల విజయనలత్ రజతం, భారత్‌కు చెందిన రితిక్ రాహుల్ ఎం కాంస్యం సాధించారు.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సబితా టొప్పో 13.86 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం కైవసం చేసుకోగా, మరో భారత అథ్లెట్ షైనీ గ్లాడ్సియా రజతం దక్కించుకున్నారు. డిస్కస్ త్రోలో వైభవ్ తన మొదటి ప్రయత్నంలోనే 51.97 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించారు. మహిళల 1,500 మీటర్ల పరుగులో ప్రాచి దేవ్కర్ స్వర్ణం, రాశి రజతం గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించారు.
పురుషుల 5,000 మీటర్లలో గౌరవ్ భాస్కర్ భోసలే స్వర్ణం సాధించగా, సత్యం కాంస్యం కైవసం చేసుకున్నారు. జావెలిన్ త్రోలో పూనమ్, దుర్వ షెవాలే వరుసగా స్వర్ణం, రజతాలు సొంతం చేసుకున్నారు. మహిళల 400 మీటర్ల విభాగంలో 17 ఏళ్ల తను చౌదరి 53.87 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం సాధించారు.
మహిళల ట్రిపుల్ జంప్‌లో సాధనా రవి 13.24 మీటర్ల దూరం దూకి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఈ విజయాలన్నింటితో భారత్ ఇప్పటివరకు 13 స్వర్ణ పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాలుగు పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో నిలిచింది.







