ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నార్నే వెంకట సుబ్బయ్య హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి ఏటా నవంబర్ 16న రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో 243ను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్ తేలే వరకు జీవో అమలును నిలిపివేయాలని, ప్రభుత్వ నిధులను లేదా యంత్రాంగాన్ని ఈ వేడుకల కోసం వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

రామోజీరావు సంఘ సేవకుడు లేదా స్వాతంత్య్ర సమరయోధుడు కాదని, ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమేనని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రజాధనాన్ని వ్యక్తిగత వేడుకలకు ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. ఈ నిధులను విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి అత్యవసర సేవల కోసం ఉపయోగించాలని ఆయన కోరారు.

రామోజీరావు జయంతి నిర్వహణలో వివిధ శాఖలను భాగస్వాములను చేయడం వల్ల పరిపాలనా భారం పెరుగుతుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి సహేతుక కారణాలు చూపలేదని, ఇది ఏకపక్ష నిర్ణయమని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

మార్గ్ దర్షి ఫైనాన్షియల్స్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ. 248 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రామోజీరావుపై ఉన్నాయని పిటిషనర్ గుర్తుచేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిటర్ల రక్షణ చట్టం కింద ఆయనపై నమోదైన కేసులను ఆగస్టు 2, 2024న ప్రభుత్వం మూసివేసిందని, జప్తు ఉత్తర్వులను ఎత్తివేసిందని ఆయన వివరించారు.

గతంలో జూన్ 27, 2024న జరిగిన రామోజీరావు సంస్మరణ సభ కోసం ప్రభుత్వం రూ. 4.28 కోట్లు ఖర్చు చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 10, 2025న ప్రభుత్వం 22 మంది ప్రముఖుల జయంతి వేడుకలను నిర్వహించేందుకు జీవో 689 జారీ చేసిందని, వారి విషయంలో ప్రజలకు అభ్యంతరాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా జరపడంపైనే సర్వత్రా వ్యతిరేకత ఉందని ఆయన కోర్టుకు వివరించారు.