ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది. మేదరమెట్లలో ప్రయాణికులను దింపి తిరిగి ఒంగోలు వైపు వస్తుండగా, సౌత్‌బైపాస్ వద్ద ఉన్న సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో కారు ఇంజిన్ బానెట్‌లో పెద్ద శబ్దం వచ్చింది.
శబ్దం వచ్చిన వెంటనే కారు నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి కిందకు దిగిపోయాడు. అతను బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించాయి.
నడిరోడ్డుపై కారు కాలిపోతుండటాన్ని చూసిన ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది.
ఇంజిన్‌లో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ సకాలంలో స్పందించి బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.








