ఎల్‌నినో వల్ల భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు, భూగర్భ జలాలను పెంచే వీబీజీ రాంజీ పథకం (నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేసే పథకం) కింద పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 'ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట' అనే నినాదంతో జల సంరక్షణ పనులను అధికారులు ప్రారంభించారు.
మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 492 గ్రామ పంచాయతీల్లో ఈ పనులను అమలు చేస్తున్నారు. ప్రతి పంచాయతీకి 80 సోక్ పిట్స్ (మురుగు నీరు భూమిలోకి ఇంకేలా చేసే గుంతలు), రెండు కమ్యూనిటీ సోక్ పిట్స్, రెండు ఫామ్ పాండ్స్ (పంట పొలాల్లో నీటి నిల్వ గుంతలు), రెండు బోర్‌వెల్ రీచార్జి గుంతలు, ఒక పర్క్యులేషన్ ట్యాంకు (నీటిని భూమిలోకి పంపే చెరువు) నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,166 ఫామ్ పాండ్లు మంజూరు కాగా, అందులో 435 పనులు మొదలయ్యాయి. అలాగే 2,400 వ్యక్తిగత సోక్ పిట్లు మంజూరు కాగా 282 పనులు గ్రౌండింగ్ అయ్యాయి. వీటితో పాటు 687 కమ్యూనిటీ సోక్ పిట్లు, 382 బోర్‌వెల్ రీచార్జి స్ట్రక్చర్లు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తే, ఇప్పటివరకు 29 ఫామ్ పాండ్లు, 104 వ్యక్తిగత సోక్ పిట్లు, 20 కమ్యూనిటీ సోక్ పిట్లు పూర్తయ్యాయి. ఈ పనుల వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, ఉపాధి హామీ కూలీలకు అదనపు పని దినాలు లభించనున్నాయి.
మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయించడంపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు జరిగేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలు సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నాయి.








