ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుత్తూరు మున్సిపాలిటీలు, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై పందెం రాయుళ్లు కోట్లాది రూపాయలు కాస్తున్నారు. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న అంచనాతో పందేలు పెరిగాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అధికారంలో ఉండటం తమను గెలిపిస్తాయని అధికార కూటమి వర్గాలు భావిస్తుంటే, స్థానిక వ్యతిరేకత, అభ్యర్థుల ఎంపికలో లోపాలు తమకు కలిసి వస్తాయని ప్రతిపక్ష వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో పందెం రాయుళ్లు రెండు వర్గాలుగా విడిపోయి వాట్సాప్ గ్రూపులు, రహస్య స్థావరాల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీపై అందరి దృష్టి ఉంది. గత 2021 ఎన్నికల్లో 25 వార్డులకు గాను 19 చోట్ల వైసీపీ గెలిచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగా, ఇప్పుడు 32 వార్డుల్లో 13 చోట్ల టీడీపీ ఏకగ్రీవమైంది. మిగిలిన 19 స్థానాల్లో టీడీపీ పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని ఒకరు, వైసీపీ తన పట్టు నిలుపుకుంటుందని మరొకరు పందేలు కాస్తున్నారు.
పుత్తూరు మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి బరిలో ఉండటంతో కూటమి, వైసీపీ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి రోజాకు షాక్ ఇవ్వాలని కూటమి కార్యకర్తలు, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌కు రోజా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వైసీపీ నేతలు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఇక్కడ సామాజిక సమీకరణాలు, తమిళ ఓటర్లు, వయోవృద్ధుల ఓటింగ్ కీలకంగా మారాయి.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బెట్టింగ్‌ల జోరు ఎక్కువగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 60 వేల మెజారిటీ సాధించడంతో, టీడీపీ కంచుకోటగా ఉన్న కార్పొరేషన్లో భారీ మెజారిటీ వస్తుందని కూటమి నేతలు, తమకు ఊహించని మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు పందేలు వేస్తున్నారు.
జిల్లాలో నమోదైన భారీ పోలింగ్ శాతం పందెం రాయుళ్లలో ఉత్కంఠను పెంచుతోంది. అధికార పక్షం దీనిని సంక్షేమ పథకాల ఫలితంగా చూస్తుంటే, ప్రతిపక్షం మాత్రం లోలోపల ఉన్న సైలెంట్ ఓటింగ్ వల్లే పోలింగ్ పెరిగిందని వాదిస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లోని ప్రతిష్టాత్మక పోరు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బెట్టింగ్‌ల దందా కొనసాగుతోంది.








