చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య (66) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, సుమారు రూ. 80 వేలు ఖర్చు చేశారు.
చికిత్స పొందుతున్న క్రమంలో శంకరయ్య మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా, జోగాపూర్ గ్రామం సమీపంలో ఊహించని ఘటన జరిగింది.
అంబులెన్స్‌లో ఉన్న శంకరయ్య ఒక్కసారిగా లేచి నిలబడటంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు ఆయనను వేములవాడలోని మరొక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ శంకరయ్యను పరీక్షించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. తండ్రి చనిపోయాడనే వార్త విని గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ఆయన కుమారులు, ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయారు.
ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్థులు శంకరయ్యను చూసేందుకు ఆసక్తిగా తరలివచ్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.








