అమెరికాకు చెందిన 28 ఏళ్ల కార్ల్ అనే యువకుడు ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తన పెంపుడు పిల్లి లూనాను చూస్తాడు. అయితే, ఆ తర్వాత రోజంతా అతడు ఎవరిని చూసినా వారి ముఖాల్లో పిల్లి కళ్లు, చారలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ ఫొటోలు, వీడియోల్లోని వ్యక్తులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని అతడు చెబుతున్నాడు.

ఈ వింత అనుభవానికి కారణం రెండేళ్ల క్రితం అతడి మెదడుకు జరిగిన శస్త్రచికిత్స. మెదడులో ధమనులు, సిరల మధ్య రక్తనాళాలు అసాధారణంగా చిక్కుకుపోయే ఆర్టీరియోవీనస్ మాల్‌ఫార్మేషన్ (AVM) అనే సమస్యతో కార్ల్ బాధపడేవాడు. రక్తస్రావం కాకుండా ఉండేందుకు వైద్యులు అతడి మెదడులోని కుడివైపు టెంపోరల్ లోబ్‌లో కొంత భాగాన్ని తొలగించారు. ముఖాలను గుర్తించి, వాటి లక్షణాలను విశ్లేషించే మెదడులోని కీలక భాగం ఇదే.

కార్ల్ ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిశోధకులు ‘కార్టెక్స్’ అనే వైద్య జర్నల్‌లో ప్రచురించారు. అతడికి ప్రోసోపోమెటామార్ఫోప్సియా అనే అరుదైన దృశ్య గ్రహణ సమస్య ఉందని వారు గుర్తించారు. ఈ పరిస్థితిలో మనుషుల ముఖాలు సహజంగా కనిపించకుండా వక్రీకరించినట్లు మారుతాయి. అంతేకాదు, గతంలో చూసిన దృశ్యాలు మెదడులో నిలిచిపోయి మళ్లీ మళ్లీ కనిపించే పాలినోప్సియా అనే మరో సమస్య కూడా అతడికి ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.

ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉదయం మొదట ఎవరిని చూస్తే ఆ వ్యక్తి లక్షణాలే రోజంతా ఇతరుల ముఖాల్లో కనిపిస్తాయి. ఒకవేళ ఉదయం పిల్లిని కాకుండా మనిషిని చూస్తే, ఆ వ్యక్తి ముఖ లక్షణాలే పిల్లి లూనా ముఖంలో కూడా కనిపిస్తాయని కార్ల్ వివరించాడు. ఇలాంటి అనుభవాలు కొన్ని గంటల నుంచి రోజంతా కొనసాగుతాయని పరిశోధకులు పేర్కొన్నారు.

కార్ల్ కేసును అర్థం చేసుకునేందుకు పరిశోధకులు కృత్రిమ మేధ (AI) సాయంతో ప్రత్యేక చిత్రాలను రూపొందించారు. ఈ అరుదైన పరిస్థితిపై మరిన్ని అధ్యయనాలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.