అమెరికాలోని ప్రముఖ ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, చేతిలో ఉన్న రెండు ఇంజినీరింగ్ డిగ్రీలను వదిలేసి సాత్విక వీరవల్లి సినిమాల్లోకి వచ్చారు. దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సాత్విక తన తొలిరోజుల అనుభవాలను గుర్తుచేసుకుంటూ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు.

ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు తన నిర్ణయం తప్పైతే ఏంటని చాలా భయపడ్డానని సాత్విక తెలిపారు. నాలుగు ఏళ్ల వృత్తిపరమైన అనుభవం, రెండు డిగ్రీలను దేనికోసం వదిలేస్తున్నానోనని ఆ రోజు తీవ్రంగా ఆందోళన చెందానని చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత తన భయాలన్నీ పూర్తిగా తొలగిపోయాయని ఆమె వెల్లడించారు.

బాక్సాఫీస్ లెక్కలు, నంబర్ల కంటే వందలాది మంది ప్రేమ, కష్టంతో తయారైన ఈ అందమైన చిత్రంలో భాగం కావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని సాత్విక అన్నారు. చిత్ర బృందం తనను ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం వల్ల ఒక్కరోజు కూడా ఇంటికి దూరంగా ఉన్నాననే భావన రాలేదని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, స్వప్న దత్, ప్రియాంక దత్, సందీప్, రమ్య, విద్యలతో పాటు దర్శకుడు పవన్ సాధినేనికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. స్టోరీ డిస్కషన్స్ నుంచి షూటింగ్ చివరి రోజు వరకు తనకోసం దర్శకుడు ఎంతో పోరాడారని కొనియాడారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ యాక్టింగ్‌కి, డ్యాన్స్‌కు తాను వీరాభిమానినని సాత్విక మురిసిపోయారు. ఈ ఈవెంట్‌కు రాలేకపోయిన నటి శృతి హాసన్‌ను పవర్ హౌస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అని ప్రశంసించారు. తనతో పాటు నటించిన రోహిణి, శ్వాసిక, చైతు తదితరులతో పాటు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కు ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.