ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నెల 25 నుంచి ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ కార్యక్రమం జరుగుతోంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందించారు. అయితే, ఫారం నింపే విధానం తెలియక చాలా మంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. సమగ్రంగా నింపకపోతే ఓటు తొలగిస్తారేమోనని భయపడుతున్నారు.
ఈ గణన ఫారం మొదటి భాగంలో 2026 జాబితాలోని ఓటరు పేరు, ఫొటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలు ముద్రించి ఉంటాయి. ఇక్కడ పాత ఫొటో పక్కనే ఓటరు తాజా ఫొటో అతికించాలి. రెండో భాగం రెండు బాక్సులుగా ఉంటుంది. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు మొదటి బాక్సులో తమ పేరు, గుర్తింపు కార్డు నంబరు, సంరక్షకుడి పేరు, బంధుత్వం, నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబరు, క్రమ సంఖ్య నమోదు చేయాలి.
2002 జాబితాలో తమకు ఓటు లేనివారు రెండో బాక్సులో తండ్రి, తల్లి, తాత లేదా నానమ్మలలో ఒకరి వివరాలు 2002 జాబితా ప్రకారం నింపాలి. మూడో భాగంలో ఓటరు ప్రస్తుత వివరాలైన పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, తల్లిదండ్రుల పేర్లు, వారి ఓటు కార్డు నంబర్లు నమోదు చేయాలి. వివాహం అయినవారు భాగస్వామి పేరు, ఓటు కార్డు నంబరు రాస్తే చాలు, కానివారు ఆ బాక్సును ఖాళీగా వదిలేయాలి.
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ సర్వేలో ప్రజలందరూ పాల్గొని, బీఎల్‌వోలు ఇచ్చిన ఫారాలను జాగ్రత్తగా పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాల నకళ్లు జతచేయాలి. తప్పుడు వివరాలు ఇవ్వకూడదు. ఏమైనా సందేహాలుంటే వెంటనే బీఎల్‌వోలను అడిగి తెలుసుకోవడం ద్వారా ఓటు హక్కును కాపాడుకోవచ్చు.





