బీఆర్‌ఎస్‌ పార్టీ ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం, బుధవారం మధ్యాహ్నం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎత్తిపోతలను మొదలుపెట్టింది. ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది, గాయత్రీ పంపుహౌస్‌ల మీదుగా మధ్యమానేరుకు నీటిని తరలిస్తున్నారు. నాలుగు పంపులను ఆన్ చేసి, ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

గత నాలుగు రోజుల క్రితం ఎల్లంపల్లిలో 7 నుంచి 8 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, వర్షాల వల్ల వచ్చిన ఇన్‌ఫ్లోతో బుధవారం సాయంత్రానికి అది 11 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 76 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో, వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఎత్తిపోసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నీటిని అవసరమైతే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించే అవకాశం ఉంది.

మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా బీఆర్‌ఎస్‌ నాయకుల ఒత్తిడితో ఎంజీకేఎల్‌ఐ (MGKLI) లిఫ్ట్-1 నుంచి సాగునీటిని విడుదల చేశారు. రెండు, నాలుగు మోటర్ల ద్వారా కృష్ణానది జలాలను ఎత్తిపోస్తూ ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ మరియు గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4 లక్షల 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 303 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 ద్వారా జరుగుతున్న ఈ ఎత్తిపోతలు ఆగస్టు 2 వరకు కొనసాగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎల్లంపల్లికి వరద ప్రవాహం కొనసాగితే, మల్లన్నసాగర్ వరకు లేదా వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ వరకు నీటిని తరలించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.