సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ అధినేత కెసిఆర్ ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవరూ గైర్హాజరు కావద్దని, ప్రతి చర్చలోనూ చురుగ్గా పాల్గొనాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే బిఆర్ఎస్ అజెండా కావాలని కెసిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల విధానాలను ఎండగట్టాలని ఆయన సూచించారు. స్పీకర్ వ్యవహరిస్తున్న పక్షపాత ధోరణి, ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను అసెంబ్లీ, మండలి వేదికలుగా ప్రశ్నించాలని ఆయన కోరారు.

ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై కెసిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని కాంగ్రెస్ నేతలకు అర్థమైందని, అందుకే వారు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాకనే రేవంత్ రెడ్డి బూతు పురాణం మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. తన చావును కోరుతూ రేవంత్ పదే పదే మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తితో చర్చకు అసెంబ్లీకి రావాలా అని కెసిఆర్ ప్రశ్నించారు.