కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, ఆ ఫ్లెక్సీలలో స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫోటోలు లేకపోవడంతో వివాదం మొదలైంది.
పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తి ఫ్లెక్సీలు ఎలా పెడతారని ప్రశ్నిస్తూ మరో వర్గం నేతలు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు శేరి సతీష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లెక్సీలను చింపివేసిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.








