హిమాలయాల మహాకుంభంగా పిలిచే ఈ యాత్ర, ఉత్తరాఖండ్ సంస్కృతికి ప్రతీక. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ భారీ యాత్రను 'రాజ్ జాత్' లేదా 'బడి జాత్' అని పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న చమోలి జిల్లాలోని కురుడ్ నందా ధామ్ నుంచి యాత్ర మొదలైంది. అయితే, పూర్తి స్థాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అధికారిక రాజ్ జాత్ యాత్రను 2027లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత యాత్ర స్థానిక కమిటీలు, గ్రామస్తుల సహకారంతో కొనసాగుతోంది.

స్థానికులు నందాదేవిని కేవలం దేవతగా కాకుండా, తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. శివుడిని వివాహం చేసుకున్న నందాదేవి, తన పుట్టింటి నుంచి కైలాసానికి వెళ్లే ప్రయాణానికి గుర్తుగా ఈ యాత్రను నిర్వహిస్తారు. సుమారు 280 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రయాణంలో భక్తులు దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలను దాటుతూ కాలినడకన వెళ్తారు. ఇది భక్తికి, సాహసానికి ఒక పరీక్షగా నిలుస్తుంది.

ఈ యాత్రలో 'రాజ్ జాత్', 'లోక్ జాత్' అనే రెండు రకాలు ఉన్నాయి. ప్రతి ఏడాది స్థానికంగా జరిగే సాధారణ యాత్రను లోక్ జాత్ అంటారు. వందలాది దేవతల పల్లకీలతో, అనేక గ్రామాల ప్రజలు కలిసి 12 ఏళ్లకు ఒకసారి చేసే మహాయాత్రను రాజ్ జాత్ అని పిలుస్తారు. పూర్వకాలంలో స్థానిక రాజుల పర్యవేక్షణలో జరగడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. యాత్రలో నాలుగు కొమ్ములున్న మేకపోతు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది, ఇది భక్తుల నమ్మకం ప్రకారం యాత్రకు ముందుండి నడిపిస్తుంది.

సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో ఉండే జునార్గలీ పాస్ వంటి కఠినమైన మార్గాల గుండా భక్తులు ప్రయాణిస్తారు. ప్రతికూల వాతావరణం, ప్రమాదకరమైన కొండ మార్గాలు ఉన్నప్పటికీ, అమ్మవారిపై ఉన్న భక్తితో వేలాది మంది ఇందులో పాల్గొంటారు. యాత్ర సందర్భంగా చమోలి జిల్లాలోని గ్రామాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. తమ ఇంటి ఆడపడుచును అత్తవారింటికి పంపుతున్నామన్న భావనతో స్థానికులు కన్నీటి వీడ్కోలు పలుకుతారు.

యాత్ర చివరి దశలో హోమ్‌కుండ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అరుదైన ఘట్టాన్ని చూడటానికి భక్తులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. కఠినమైన పరిస్థితులను అధిగమిస్తూ సాగే ఈ పవిత్ర యాత్ర సెప్టెంబర్ 30న ముగియనుంది.