ఇరాన్‌లోని సనందజ్ నగరానికి సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హమదాన్ నుంచి మరీవాన్ వైపు వెళ్తున్న ఇంధన ట్యాంకర్, బ్రేక్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పేలిపోయింది.

ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు పశ్చిమ దిశగా సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సనందజ్ సమీపంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018లో కూడా ఇదే ప్రాంతంలో ఒక ఇంధన ట్యాంకర్ ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.

ఇరాన్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, అలాగే అసురక్షిత వాహనాలను వాడటం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.