తమిళనాడులోని దిండిగల్ పీఎస్‌ఎన్‌ఏ (PSNA) ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు కేరళలోని గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో 66వ జాతీయ రహదారిపై పనంబిక్కున్ను వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా ఉంది. రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. కారు లారీ కింద ఇరుక్కుపోవడంతో, అందులో ఉన్న వారిని బయటకు తీయడానికి పోలీసులు కారును కట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆస్పత్రికి చేరుకునే సమయానికే విద్యార్థులు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం త్రిశూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.







