గార్గోయెల్స్ అంటే భారీ శరీరం, రెక్కలు కలిగి గాలిలో ఎగిరే జీవులు. ఇవి మనుషులకు హాని చేయవని, చెడుపై పోరాటంలో మంచి వైపు నిలబడతాయని ప్రాచుర్యంలో ఉన్న కథలు చెబుతున్నాయి. అందుకే వీటిని 'మంచి దెయ్యాలు' అని పిలుస్తారు. పూర్వకాలంలో ఎత్తైన భవనాలపై వీటి విగ్రహాలను ఏర్పాటు చేసేవారు. ఇవి ఆ ప్రాంతంలోకి దుష్ట శక్తులు రాకుండా కాపాడుతాయని, మన దగ్గర వాడే దిష్టి బొమ్మల మాదిరిగా పనిచేస్తాయని ప్రజలు నమ్ముతారు.
ఈ జీవుల మూలాల గురించి క్రీస్తుశకం 600వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లోని రౌన్ ప్రాంతంలో ఒక కథ ప్రచారంలో ఉంది. 'లా గార్గిల్లె' అనే డ్రాగన్ లాంటి ప్రాణి నోటి నుంచి మంటలు, నీళ్లను చిమ్ముతూ ఊళ్లను నాశనం చేసేది. రోమన్ అనే బిషప్ ఆ డ్రాగన్‌ను అంతం చేయడంతో, జనాలు కృతజ్ఞతగా టౌన్ హాల్ దగ్గర దాని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో యూరప్ నుంచి ప్రపంచవ్యాప్తంగా గార్గోయెల్స్ విగ్రహాలు విస్తరించాయి.
మరోవైపు, వేల సంవత్సరాల క్రితం ఒక మాంత్రికుడు గార్గోయెల్స్ అనే కమ్యూనిటీని వశపరుచుకుని మనుషులపై దాడులు చేయించేవాడని మరొక కథనం ఉంది. కింబోర్గిని అనే గార్గోయెల్ ఆ మాంత్రికుడిని ఓడించి తన జాతిని కాపాడింది. అయితే, ఆ మాంత్రికుడు ఇచ్చిన శాపం వల్ల అవి పగలు రాతి బొమ్మలుగా మారి, వందేళ్లకు ఒకసారి రాత్రిళ్లు మాత్రమే ప్రాణం పోసుకుంటాయని చెబుతుంటారు. ఈ కథల ఆధారంగానే వాల్ట్ డిస్నీ కంపెనీ 1994లో టీవీ సిరీస్‌ను కూడా రూపొందించింది.
నిజ జీవితంలో కూడా గార్గోయెల్స్ ఉనికిపై చర్చలు జరిగాయి. 2004లో చిలీలో కార్మన్ అడెట్జ్ డె లా టోరి అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుండగా, విచిత్రమైన భారీ ఆకారాన్ని చూశామని చెప్పింది. ఆ కుటుంబం అనుభవాన్ని ఇంటర్నేషనల్ పారానార్మల్ సొసైటీ ఒక డాక్యుమెంటరీగా తీసింది. అయితే, ఈ జీవుల జాడ కోసం వెతికిన నలుగురు ఇన్వెస్టిగేటర్లు కనిపించకుండా పోవడం ఈ వ్యవహారంలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
2016లో కార్మన్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఆ ఘటనకు గార్గోయెల్స్ కథకు ముడిపెట్టి చాలామంది చర్చించుకున్నారు. అయితే, అంతకుముందు ఆ కుటుంబం తమకు ప్రాణహాని ఉందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో, పోలీసులు దీన్ని వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన దాడిగా భావించి కేసును మూసివేశారు. ఇప్పటికీ గార్గోయెల్స్ అనేవి కేవలం ఫాంటసీ క్యారెక్టర్లని కొందరు నమ్ముతుంటే, అమెజాన్ అడవుల్లో ఇవి ఉన్నాయని మరికొందరు ప్రచారం చేస్తుంటారు.








