శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు, అలియాస్ చిన్ని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి వారు తమ రాజకీయ వ్యవహారాలను చూసుకోవాలని, పక్క జిల్లాల నేతల జోక్యం తమకు అవసరం లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

రామ్ మనోహర్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించేనని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పనిచేసిన సమయంలో, అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని పార్టీలో టాక్ ఉంది. ఆ వర్గాన్ని బొత్స ప్రోత్సహిస్తూ వస్తున్నారని ధర్మాన వర్గం అసంతృప్తిగా ఉంది.

ధర్మాన వర్గం అసంతృప్తికి మరో కారణం కూడా ఉంది. జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గానికి బొత్స సత్యనారాయణ అండగా ఉంటున్నారని, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన దువ్వాడ శ్రీనివాస్‌కు కూడా ఆయన మద్దతు ఇస్తున్నారని ధర్మాన వర్గం భావిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్‌ను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి బొత్స ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా ధర్మాన వర్గంలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని రామ్ మనోహర్ నాయుడు వివరణ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులని, ఆయనను విమర్శించే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నాననే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ గతంలో జిల్లాలో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఇద్దరి మధ్య సయోధ్య ఉండేదని, ధర్మాన కూడా బొత్సపై ఎప్పుడూ బహిరంగ విమర్శలు చేయలేదని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా, రామ్ మనోహర్ నాయుడు వ్యాఖ్యలతో శ్రీకాకుళం రాజకీయాలు తూర్పు కాపు వర్సెస్ వెలమ సామాజిక వర్గాల మధ్య పోరుగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది.