రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd.) సంస్థ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో మొత్తం 326 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష ఉండదు, కేవలం విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ అభ్యర్థుల మార్కులు సమానంగా ఉంటే, వారిలో ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ఖాళీల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో 135, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో 105, ట్రేడ్ అప్రెంటిస్ విభాగంలో 74 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, డిప్లొమా (కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్), అటెండెంట్ ఆపరేటర్ వంటి వివిధ విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, 1984 అల్లర్ల బాధితుల కుటుంబాలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. పోస్టును బట్టి బీకామ్, బీబీఏ, డిప్లొమా, బీఎస్సీ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్ www.rcfltd.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కెరీర్స్ విభాగంలో NAPS (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్) లేదా NATS (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత RCF దరఖాస్తు లింక్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి, సెప్టెంబర్ 20 సాయంత్రం 5 గంటల లోపు ప్రక్రియను పూర్తి చేయాలి.
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 17,300, టెక్నికల్ అప్రెంటిస్‌లకు రూ. 16,000, ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ. 14,600 స్టైపెండ్ అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.








