హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్ (JNTUH) హాస్టళ్లలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడులు చేసుకున్నారు. గౌతమి, మంజీరా హాస్టళ్ల వద్ద జరిగిన ఈ ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. భయపడిన మిగతా విద్యార్థులు వేరే గదుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు.

బుధవారం రాత్రి జరిగిన తీజ్ వేడుకల సమయంలోనే ఈ వివాదం మొదలైంది. ఒక విద్యార్థి మరొకరి ప్రవర్తనపై వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అప్పట్లో తోటి విద్యార్థులు సర్దిచెప్పి పంపించినప్పటికీ, ఆ గొడవ గురువారం అర్ధరాత్రి తీవ్రరూపం దాల్చింది. హాస్టల్ గదుల్లోకి చొరబడిన విద్యార్థులు తలుపులు విరగ్గొట్టి మరీ దాడులకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ (KPHB) పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శుక్రవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వర్సిటీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ గొడవకు ర్యాగింగ్ కారణం కాదని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ప్రిన్సిపాల్, హాస్టల్ నిర్వాహకులు మరియు సిబ్బందితో విచారణ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కాట్రావత్ నవీన్ నాయక్ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై, వసంత్ నాయక్ ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో మరో ఏడుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి.

ఘర్షణకు కారకులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం వర్సిటీలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు.