యూరప్ ఖండంలో వాతావరణ మార్పుల వల్ల ఎండలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పశ్చిమం నుంచి వచ్చిన వడగాల్పులు, భూతాపం పెరగడం, కర్బన ఉద్గారాల (పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్య వాయువులు) ప్రభావంతో గ్రీస్, పారిస్, రోమ్ వంటి ప్రాంతాలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయాయి. ఈ ఎండల ధాటికి రోడ్లు కరిగిపోవడంతో పాటు రైలు పట్టాలు సైతం వంకర తిరిగాయి.
ఈ వడగాల్పుల వల్ల యూరప్‌లో సుమారు 35 వేల మంది మరణించారని అనధికార గణాంకాలు చెబుతున్నాయి. జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ (జర్మనీ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ) అంచనా ప్రకారం, ఆ దేశంలో ఏప్రిల్ 6 నుంచి ఆగస్టు 9 మధ్య సుమారు 14 వేల మంది చనిపోయారు. సాధారణ వేసవి కాలంతో పోలిస్తే అక్కడ మరణాల రేటు భారీగా పెరగడం ఇదే మొదటిసారి.
మరణాల జాబితాలో ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది. అక్కడ సాధారణం కంటే 7,300 మరణాలు అధికంగా నమోదయ్యాయి. స్పెయిన్‌లో 4,947, ఇంగ్లండ్‌లో 2,877, బెల్జియంలో 1,222, పోలాండ్‌లో 1,070, నెదర్లాండ్స్‌లో సుమారు 900 మంది ఎండల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లోని పిప్సోస్‌లో జూన్ 23న 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, ఇది 1947 తర్వాత ఆ దేశంలో అత్యధికం.
జర్మనీలో జూన్ చివరలో 46 ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. పారిస్, బెర్లిన్ నగరాల్లో సాధారణంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఈ ఏడాది అది 40 డిగ్రీలకు చేరుకుంది. ప్రాగ్, వియన్నా, మాడ్రిడ్, డబ్లిన్, బుకారెస్ట్ నగరాల్లో కూడా సాధారణం కంటే 10 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల యూరప్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. 2024లో భారత్ నుంచి 38 లక్షల మంది యూరప్‌కు వెళ్లగా, 2025లో ఆ సంఖ్య 40 లక్షలకు పెరిగింది. అయితే, ఈ ఏడాది వాతావరణ మార్పుల దృష్ట్యా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ అభివృద్ధి చెందుతున్నా, ప్రకృతి ప్రకోపాన్ని అడ్డుకోవడంలో అవి విఫలమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.







