పాకిస్తాన్ సైన్యానికి, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) అనే సాయుధ రెబల్ గ్రూపుకు మధ్య కొంతకాలంగా భీకర పోరు జరుగుతోంది. తాజాగా బీఎల్‌ఏ జరిపిన వేర్వేరు దాడుల్లో 25 మంది పాక్ సైనికులు మరణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా బీఎల్‌ఏ విడుదల చేసింది.

శుక్రవారం జియారత్ క్రాస్ వద్ద పాక్ మిలిటరీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏకు చెందిన ఫతేహ్ స్క్వాడ్ దాడి చేసింది. ఈ ఘటనలో 18 మంది సైనికులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. పర్వత ప్రాంతాల్లో గ్వెరిల్లా తరహా మెరుపు దాడులు చేయడంలో ఫతేహ్ స్క్వాడ్ చాలా బలమైన గ్రూపుగా పేరుంది. గత ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసినది కూడా ఇదే గ్రూపు.

మరోవైపు, సూరబ్ పరిధిలోని హజికా ప్రాంతంలో బీఎల్‌ఏకు చెందిన ఎస్‌టీఓఎస్ (STOS) అనే మరో గ్రూపు పాక్ సైన్యంపై దాడి చేసింది. రిమోట్ కంట్రోల్ వాహనాన్ని ఉపయోగించి జరిపిన ఈ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల గురించి పాక్ ప్రభుత్వం లేదా సైన్యం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ వరుస దాడులు పాక్ సైన్యం వైఫల్యమని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పనితీరుపై స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వ పాలన నుంచి విముక్తి పొంది, తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని బలూచ్ పౌరులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు.

బెలూచిస్తాన్‌లో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని పాక్ ప్రభుత్వం తీవ్రంగా అణిచివేస్తోంది. ఇరుపక్షాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.