హైడ్రా (HYDRA) సంస్థ చీఫ్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఏర్పాటైన ఈ సంస్థ, ఇప్పటివరకు వేల కోట్ల విలువైన ఆస్తులను రక్షించామని చెబుతోంది. అయితే, ఈ సంస్థ కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తోందని, పెద్దల ఆక్రమణలను వదిలేస్తోందని బీఆర్‌ఎస్ మొదటి నుంచి విమర్శిస్తోంది.

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కొందరు నేతలు స్వీట్లు పంచుకుంటూ తీర్పును స్వాగతించారు. ఈ పరిణామం తమకు ఆయాచితంగా లభించిన అవకాశమని భావిస్తున్న గులాబీ దళం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది. హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హైడ్రా వ్యవహారాన్నే ప్రధాన అజెండాగా మార్చుకోవాలని బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తోంది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బస్తీలు, మధ్యతరగతి ప్రజలకు దగ్గరయ్యేందుకు ఈ అంశాన్ని వాడుకోవాలని పార్టీ భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

హైకోర్టు తీర్పును తమ వాదనకు బలంగా వాడుకుంటూ, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది. రంగనాథ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అది తమకు రాజకీయంగా లాభిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. హైడ్రా తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎన్నికల సమయంలో ఓట్లుగా మార్చుకోవడమే లక్ష్యంగా గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది.