హైడ్రా (HYDRA) పనితీరుపై హైకోర్టు జస్టిస్ అనిల్‌కుమార్ ఈ నెల 24న జరిగిన విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ జీవో ద్వారా ఏర్పాటైన ఈ సంస్థ, ఇతర శాఖల అధికారాలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. 40కి పైగా చెరువులు కబ్జాకు గురైనా, బడా ఆక్రమణదారులను తాకకుండా కేవలం పేదలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని కోర్టు మండిపడింది. ఈ నేపథ్యంలో, హైడ్రా కమిషనర్‌ను తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా నాదర్‌గూల్‌లో 374 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేట్ కంపెనీలు ఆక్రమించినా, హైడ్రా అధికారులు స్పందించడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసినప్పటికీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం అది ప్రైవేట్ భూమి అని ప్రకటించడం గమనార్హం. అమీన్‌పూర్‌లో సీలింగ్ ప్రక్రియ ముగియకపోయినా వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, నాదర్‌గూల్ విషయంలో మాత్రం మౌనం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, ఖాజాగూడలో 64.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణ సంస్థ చేపట్టిన భారీ భవనాలపై ఫిర్యాదులు అందినప్పటికీ హైడ్రా చర్యలు తీసుకోలేదు. అత్తాపూర్ అనంత పద్మనాభస్వామి దేవాలయ కుంట, గుడిమల్కాపూర్ నాలా ఆక్రమణలు, అల్మాస్‌గూడలో ఎఫ్‌టీఎల్ పరిధిలోని పెట్రోల్ బంక్ నిర్మాణం వంటి అనేక అంశాల్లో హైడ్రా అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బాలాపూర్ సర్వే నంబర్ 74లో ఆక్రమణలపై తహసీల్దార్ స్వయంగా లేఖ రాసినా, హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
హైడ్రాకు ఇప్పటివరకు పదివేల ఫిర్యాదులు అందాయని కమిషనర్ రంగనాథ్ చెబుతున్నప్పటికీ, కొన్ని నెలల నుంచి సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ఎటువంటి పురోగతి లేదు. కోర్టు ధిక్కరణ కేసులు ఎదురవుతున్నా, హైడ్రా తన పనితీరును మార్చుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడటంలో హైడ్రా ప్రదర్శిస్తున్న ఈ వివక్షపై ప్రజలు నిలదీస్తున్నారు.







