బీఆర్ఎస్ (BRS) నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందేందుకే సుమన్ ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని వంశీకృష్ణ ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లో పనులు చేసే అవకాశం దక్కలేదనే అసహనంతోనే సుమన్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆపదలో ఉన్నప్పుడు కాళ్లు మొక్కడం, ఆ తర్వాత చిల్లర మాటలు మాట్లాడడం సుమన్‌కు అలవాటని ఎంపీ దుయ్యబట్టారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వంశీకృష్ణ ఘాటుగా విమర్శించారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బాల్క సుమన్ అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని వంశీకృష్ణ నిలదీశారు. దాడులు, మహిళలపై అరాచకాలు, ఇసుక భూదందాలు, సెటిల్మెంట్లు చేయడం తప్ప సుమన్ సాధించింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు.
ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని వంశీకృష్ణ హెచ్చరించారు. మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.








