భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెంలో ఉన్న నర్స్ ఊకే శిరీషా నివాసానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం వెళ్లారు. హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ అత్యాచారానికి గురై హత్యకు గురైన శిరీషా చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర శిరీషా తల్లి రామలక్ష్మికి 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించేందుకు తాము వచ్చామని, న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం ఎంపీ రవిచంద్ర ఫోన్ ద్వారా శిరీషా తల్లి రామలక్ష్మి, సోదరుడు శివరాంలతో కేటీఆర్ మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయంపై నిందితుడిని కఠినంగా శిక్షించాలని శిరీషా కుటుంబ సభ్యులు కేటీఆర్‌ను కోరారు.

బాధితుల విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్, ఈ దారుణ ఘటనను అసెంబ్లీలో లేవనెత్తుతానని వారికి మాట ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని, న్యాయం జరిగేలా పోరాడుతామని ఆయన అభయమిచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఉప్పల వెంకటరమణ, కాపు సీతామహాలక్ష్మి, సింధూ తపస్వి, ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, మోరంపూడి అప్పారావు, పుష్పాల చందర్ రావు, మేకల వెంకటేశ్వర రావు, కొండవీటి రాజారావు, మేకల రాజేష్, గ్రామ సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.