సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం తాను వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఖండించారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో ఒక అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన సమ్మతి లేదా సూచనలు లేకుండానే గతంలో న్యాయవాది కోగంటి రిత్విక ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు నివేదించారని విజయలక్ష్మి తరఫు న్యాయవాది గుడివాక వాసుదేవుడు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఈ కేసులో వాదనలు వినిపించేందుకు విజయలక్ష్మి తనను నియమించుకున్నారని, అందుకు సంబంధించిన వకాలత్‌ను కూడా ఆమె సమర్పించారని వాసుదేవుడు వివరించారు. అయితే, పాత న్యాయవాది రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) మరియు కేసు రికార్డులు కోరినా ఆమె స్పందించడం లేదని ఆయన తెలిపారు. ఎన్‌ఓసీ లేకపోయినా వకాలత్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.
ఈ వ్యవహారంపై స్పందించిన జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం, విజయలక్ష్మి లేవనెత్తిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు న్యాయవాది రిత్వికకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు, కేసు దర్యాప్తు పురోగతిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం, ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని తెలుసుకుంది.
ఈ కేసులో దర్యాప్తు వివరాలను, అలాగే ప్రధాన నిందితుడు నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమ ముందుంచాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.





