ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిధుల కొరతతో పాటు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారడంతో, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రస్తుతం 6 నుంచి 7 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది.
నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అలాగే, గట్టు ఎత్తిపోతల పథకానికి రిజర్వాయర్ నిర్మాణానికి 283 ఎకరాలు, కాల్వల కోసం మరో 249 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు.
ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే రైతులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించినా సానుకూలత రాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 130 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉండగా, పాలమూరు–రంగారెడ్డి, భీమా ప్రాజెక్టుల పనులు కూడా వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం సేకరించాల్సిన భూమిలో ఇప్పటికే 65 శాతం ప్రక్రియ పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ విషయంలో రైతుల అభ్యంతరాలను తొలగించేందుకు త్వరలో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.






