శనివారం జరిగిన కేరళ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో భాగంగా స్టేజీపై ట్రోఫీ పక్కన నిలబడిన సంజూ శాంసన్‌ను, అక్కడికి వచ్చిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అసలు చూడనే లేదు. సంజూ పక్కనే ఉన్న మిగిలిన అధికారులకు శ్రీశాంత్ షేక్ హ్యాండ్ ఇచ్చారు కానీ, సంజూ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా పక్కకు వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపించాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సంజూకు జరిగిన అవమానంపై కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై శ్రీశాంత్ కానీ, సంజూ శాంసన్ కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది నిజమైన వీడియోనా లేక ఏఐ (కృత్రిమ మేధస్సుతో సృష్టించిన) వీడియోనా అనే దానిపై కూడా స్పష్టత లేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్‌ను త్రిసూర్ టైటాన్స్ జట్టు గెలుచుకుంది. కాలికట్ గ్లోబల్‌స్టార్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో త్రిసూర్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కాలికట్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో త్రిసూర్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. అహమ్మద్ ఇమ్రాన్ 69 పరుగులతో అర్థసెంచరీ సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. టోర్నీ మొత్తంలో మహ్మద్ అజారుద్దీన్ 596 పరుగులతో టాప్ స్కోరర్‌గా, నిఖిల్ మాలిక్ 18 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచారు.
ప్రస్తుతం సంజూ శాంసన్ భారత జట్టులో టీ20, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంజూ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.








