సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించిన కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడంతో, పోలీసులు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం రాత్రి ఆరాంఘర్ వద్ద అధికారుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పని చేసి, యూపీఎస్సీ పరీక్ష రాసి 2025 బ్యాచ్ ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. 2025 డిసెంబర్ నుంచి అతను ఎన్‌పీఏ (నేషనల్ పోలీస్ అకాడమీ)లో శిక్షణ పొందుతున్నాడు. నిందితుడిపై నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని కమిషనర్ తెలిపారు.
గతేడాది మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలితో ఉదయ్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఐపీఎస్ ట్రైనీలు కావడంతో ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే, ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా, ఆయుధాలు చూపించి బాధితురాలిని భయపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేసి, ఆమె పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించాడని కమిషనర్ వివరించారు.
ప్రస్తుతం మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు.





